ఫీల్డ్ రిపోర్టర్లపై దాడులు, ఆన్‌లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేయాలి: మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు

ఫీల్డ్ రిపోర్టర్లపై దాడులు, ఆన్‌లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేయాలి: మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు
హైదరాబాద్ లో మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు దిగ్విజయం
వివిధ రాష్ట్రాల నుంచి 135 మంది మహిళ జర్నలిస్టు ప్రతినిధులు హాజరు
పలు తీర్మానాలు ఏకగ్రీవ ఆమోదం
దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టుల వృత్తిపరమైన స్వేచ్ఛ, భద్రత, గౌరవానికి భంగం కలిగించే చర్యలను అరికట్టేందకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని ‘జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు’ డిమాండ్ చేసింది. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ జె యు ), మెఫీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీ యూ డబ్ల్యూ జె) సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ రెండు రోజుల సదస్సు ఆదివారం ముగిసింది.దేశంలోని వివిధ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 65 మంది ప్రతినిధులతో పాటు తెలంగాణ నుంచి 70 మంది, మొత్తం 135 మందికి పైగా మహిళా జర్నలిస్టులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తాము ఎదుర్కొంటున్న వ్యవస్థాగత, క్షేత్రస్థాయి సవాళ్లపై వారు చర్చించారు.

దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛ, భౌతిక దాడుల నుంచి భద్రత , ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పెరుగుతున్న దాడులు, ప్రతికూల పరిణామాలను మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛ, పని ప్రదేశాల్లో భద్రత ప్రాముఖ్యతను గుర్తిస్తూ, మహిళా జర్నలిస్టుల భద్రతను పటిష్టం చేయాలని, వారి వృత్తిపరమైన సమానత్వం, గౌరవం, స్వేచ్ఛను పరిరక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టాల అమలుతీరును పర్యవేక్షించే సంస్థలు, మీడియా సంస్థలను డిమాండ్ చేసింది.
వాస్తవాలను నియంత్రిస్తున్న ప్రభుత్వం:

మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్

“గతంలో అభిప్రాయాలు, వాస్తవలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవాకాశం ఉండేది. కానీ నేడు ప్రభుత్వమే వాస్తవాలను నియంత్రిస్తోంది” అని సీనియర్ జర్నలిస్టు, ఎన్ టి టీవీ సౌత్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉమా సుధీర్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జర్నలిస్టులు అధికారిక దృక్పథాన్నే ప్రామాణికంగా భావించేవారని, కానీ ఇప్పుడు సామాజిక కార్యకర్తలు, నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. హైదరాబాదులో జరుగుతున్న మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు లో భాగంగా శనివారం నాడు”మారుతున్న జర్నలిజం: డిజిటల్ నైపుణ్యత, విశ్వసనీయత, విలేకరుల ఐక్యత” అనే అంశంపై ఆమె మాట్లాడారు.

డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో జర్నలిజంలో వస్తున్న మార్పులు, ఫ్యాక్ట్-చెకింగ్ ప్రాముఖ్యత, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవా ళ్ళ గురించి ఎన్ డి టీవీ సౌత్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ మాట్లాడారు. ఏఐ రాకముందు ఫ్యాక్ట్-చెకింగ్ కోసం జరిగే నిశితమైన పరిశోధన, పరిశీలనల గురించి ఆమె ప్రస్తావిస్తూ, మానవ ప్రమేయం ఇప్పటికీ ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఎడిటర్లకు గతంలో ఉన్నట్లుగా తుది నిర్ణయాధికారం లేకుండా న్యూస్‌రూమ్‌లు వికేంద్రీకరణ చెందాయని, ఎడిటోరియల్ నిర్ణయాల్లో మానవ ప్రమేయం తగ్గిపోయింద న్నారు.

పాత్రికేయ సూత్రాలతో రాజీ లేకుండా ఏఐ వినియోగం : న్యూస్ మీటర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఖనీజా గరారి
ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, మానవ విచక్షణకు, క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని జర్నలిస్టులకు న్యూస్ మీటర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఖనిజా గరారి సూచించారు. హైదరాబాద్లో జరుగుతున్న మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు లో భాగంగా రెండో రోజు ఆదివారం నాడు ” జర్నలిజంలో మరింత మెరుగ్గా, బాధ్యతయుతంగా ఏ ఐ వినియోగం” అనే అంశంపై ఆమె మాట్లాడారు. జర్నలిస్టులు ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా, తమ పనికి సహాయపడే ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలని నొక్కి చెప్పారు. ఒక ప్రెస్ నోట్‌ను అర్థం చేసుకోవడానికి లేదా సమాచారాన్ని గ్రహించడానికి ఏఐని ఉపయోగించేటప్పుడు, వారు ముందుగా తమ పాత్రికేయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి దానిని అధ్యయనం చేసి, అర్థం చేసుకోవాలని యువ జర్నలిస్టులకు సూచించారు. “సామాన్యులు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో సమాచారాన్ని అందించేలా జర్నలిస్టులు ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వాలి. యువ ఫ్రీలాన్సర్లకు, ఏఐ ఒక అభ్యాస సాధనంగా మారింది, ఇది అనువాదం వంటి పనులను సులభతరం చేస్తోంది. అయితే, ఏఐ రూపొందించిన అనువాదాలలో ఉండే తప్పులను జర్నలిస్టులు గుర్తించగలగాలి” అని ఆమె వివరించారు.

టీఆర్పీల వేటలో నైతిక విలువలు పతనం: ప్రొఫెసర్ పద్మజా షా
నేటి జర్నలిజం ప్రజాస్వామ్య విలువల కంటే టీఆర్పీలు, క్లిక్‌లు, లైకులు, వైరల్ న్యూస్ పైనే ఎక్కువగా ఆధారపడి నడుస్తోందని ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం విశ్రాంత హెడ్ ప్రొఫెసర్ పద్మజా షా ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు), మెఫీ,టి యు డబ్ల్యు సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు రోజుల ‘జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు’లో భాగంగా “జర్నలిజంలో నైతికత – బాధ్యతాయుతమైన భాషా వినియోగం” అనే అంశంపై ఆమె కీలక ప్రసంగం చేశారు.
సమాజంలోని వివిధ వర్గాలపై ముఖ్యంగా ప్రాంతీయ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన భాష, దిగజారుతున్న నైతిక ప్రమాణాలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని పద్మజా షా పేర్కొన్నారు.

వార్తా కథనాల్లో దేనిని ప్రసారం చేయాలి, వేటిని నివారించాలనే నిర్ణయాల్లో నైతికత ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఇది భాషతో పాటు విజువల్స్‌కూ సమానంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు. బాధితులైన బాలికలు, మహిళల వివరాలు లేదా ఫొటోలను బహిర్గతం చేయకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, ప్రముఖ మీడియా సంస్థలు సైతం వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు. దిశా ఘటనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ… ఆ సమయంలో అనేక ఎలక్ట్రానిక్ మీడియా ఛానెళ్లు చట్టాన్ని, నైతిక పరిమితులను అతిక్రమించి బాధితురాలి వివరాలను ప్రసారం చేసినా, కేవలం ఒక్క ఛానెల్‌పైనే జరిమానా విధించడం నిబంధనల అమలులోని లోపాలను, అస్థిరతను స్పష్టం చేస్తోందన్నారు. ప్రస్తుతం మీడియాకు ఏకరీతి నియంత్రణ యంత్రాంగం లేదని ఎత్తిచూపిన ఆమె, మీడియా సంస్థలన్నింటికీ తప్పనిసరి సభ్యత్వం ఉండేలా, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునే పూర్తి అధికారం కలిగిన స్వతంత్ర నియంత్రణ సంస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

నేటి జర్నలిజం విద్యార్థులను మీడియా యాజమాన్యాలు తమ స్వప్రయోజనాలకు సాధనాలుగా వాడుకునేలా సంస్థాగత శిక్షణా కేంద్రాలు తీర్చిదిద్దుతున్నాయని, రాజ్యాంగ సూత్రాలు, ప్రజాస్వామ్య స్పృహ లేని పాఠ్యాంశాలను మార్చాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న కర్ణాటక మీడియా అకాడమీ ఛైర్‌పర్సన్ అయేషా ఖానుమ్ మాట్లాడుతూ, “నైతిక విలువలే జర్నలిజానికి ఆత్మ లాంటివి, అవి లోపిస్తే జర్నలిజం అంతరించినట్లే” అని హెచ్చరించారు. ప్రైవేట్ న్యూస్ ఛానెళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు పెరిగిన ప్రస్తుత తరుణంలో సంచలనాల కోసం ప్రాకులాడకుండా, జర్నలిస్టులు ఆత్మపరిశీలన చేసుకుంటూ వృత్తిపరమైన విశ్వసనీయతను కాపాడుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.

సదస్సులో ఆమోదించిన ప్రధాన తీర్మానాలు:

పోష్ (POSH) చట్టం కఠిన అమలు: ప్రతి మీడియా సంస్థలో ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH) 2013’ను తప్పనిసరిగా అమలు చేయాలి. అన్ని సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐ సి సి) ఏర్పాటు చేయడంతో పాటు వేధింపులు, కక్షసాధింపు చర్యల నివారణకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో స్వతంత్ర భద్రతా విభాగాలను నెలకొల్పాలి.

దాడులు, పోలీసుల దురుసు ప్రవర్తనపై రక్షణ: ఫీల్డ్‌లో వార్తా సేకరణకు వెళ్లే మహిళా జర్నలిస్టులపై జరిగే భౌతిక దాడులు, పోలీసుల దురుసు ప్రవర్తనను సదస్సు తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు సమగ్ర చట్టంతో పాటు ప్రభుత్వ నిధులతో ఉచిత న్యాయ సహాయం అందించాలని డిమాండ్ చేసింది.

ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ దాడుల నిరోధం: మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్‌స్టాకింగ్, డాక్సింగ్, డీప్‌ఫేక్స్ వంటి దాడులపై చట్టపరమైన సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు బాధ్యతాయుతంగా స్పందించాలి. ఐటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ బాధితుల వ్యక్తిగత గోప్యతను కాపాడాలి.

సమాన వేతనం – ప్రాధాన్య హోదాలు: మీడియా సంస్థల్లో వేతన అసమానతలను రూపుమాపేందుకు ‘సమాన వేతన చట్టం-1976’ను పక్కాగా అమలు చేయాలి. మహిళా జర్నలిస్టులకు కీలకమైన రిపోర్టింగ్ బీట్లను కేటాయించడంతో పాటు సంపాదకీయ నాయకత్వ స్థానాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.

ప్రసూతి ప్రయోజనాలు – రుతుక్రమ సెలవులు: ప్రసూతి ప్రయోజనాల చట్టం-1961ని అమలు చేయడంతో పాటు నెలకు ఒకరోజు వేతనంతో కూడిన ప్రత్యేక రుతుక్రమ సెలవు (Menstrual Leave) మంజూరు చేయాలి. ఆఫీసుల్లో శిశు సంరక్షణ కేంద్రాలు (క్రెచ్‌లు), హెల్త్ కార్డులు అందించాలి.

సామాజిక భద్రత – పెన్షన్లు: రిటైర్డ్, రెగ్యులర్, ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్టులందరికీ వర్తించేలా దేశవ్యాప్తంగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి. ప్రమాదవశాత్తు లేదా అకాల మరణం చెందిన మీడియా ప్రతినిధుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలి.

ఉద్యోగ భద్రత – అక్రిడిటేషన్, ఇళ్ల స్థలాలు: ఉద్యోగ ఒప్పందాల పరిరక్షణకు ‘వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టం-1955’ను కచ్చితంగా అమలు చేయాలి. వివక్ష లేకుండా అర్హులైన మహిళా జర్నలిస్టులందరికీ ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డులు, జర్నలిస్టుల సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యేక హౌసింగ్ లేదా ఇళ్ల స్థలాల కేటాయింపులు చేపట్టాలి. ఈ తీర్మానాలను తక్షణమే పరిగణనలోకి తీసుకుని చట్టపరమైన, రక్షణాత్మక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సదస్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.

Comments (0)
Add Comment