IJU
Indian Journalists union
Big

ప్రభుత్వ అణచివేత చర్యలకు.. వ్యతిరేకంగా జర్నలిస్టులు ఐక్యం కావాలి!

  • పంజాబ్ చండీఘర్ జర్నలిస్ట్ యూనియన్
  • వార్షికోత్సవ వేడుకల్లో వక్తల పిలుపు!

లూధియానా, అక్టోబర్ 31: దాడులు, బెదిరింపులు, తప్పుడు కేసులు, నిర్బంధాలు , ఆంక్షల ద్వారా మీడియా గొంతు నొక్కడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని జర్నలిస్టులు ప్రతిఘటించాలని పలువురు వక్తలు పిలుపు ఇచ్చారు. పంజాబ్ – చండీగఢ్ జర్నలిస్టు యూనియన్ 13వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం లూథియానా బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో రాష్ట్ర స్థాయిలో వేడుకలు జరిగాయి. “గదర్” పత్రిక సంపాదకుడు , విప్లవకారుడు, షహీద్ కర్తార్ సింగ్ సరాభా కు అంకితంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 22 జిల్లాల నుండి 250 మందికి పైగా పాత్రికేయులు హాజరయ్యారు. తొలుత షహీద్ కర్తార్ సింగ్ చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. పలువురు మేధావులు, రచయితలు, జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ, రాష్ట్ర నాయకులు ప్రసంగిస్తూ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా పాత్రికేయులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

మీడియా గొంతు నొక్కడానికి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం, వారిపై దాడులు చేయడం, పోలీసులు, పౌర యంత్రాంగం ద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాటిగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు.

సమాచార వ్యవస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చట్టాలను, అడ్డగోలు నిబంధనలను తీసుకు వస్తోందని వారు తెలిపారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం ప్రకారం, వార్తా కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తుల నుండి ముందస్తు సమ్మతి తీసుకోవాలనే నిబంధన పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని విమర్శించారు.

Journalists must unite against the government's repressive actions!
జర్నలిజం రంగాన్ని ఈ చట్టం పరిధి నుండి మినహాయించాలని డిమాండ్ చేస్తూ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిందనీ, ఈ చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వక పోయినప్పటికీ, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు, ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం తెస్తున్న ఇలాంటి ఆంక్షల వల్ల అనేక న్యూస్‌రూమ్‌లు మూతపడే ప్రమాదం ఉందని వక్తలు హెచ్చరించారు.

ప్రముఖ మేధావి, బాబా ఫరీద్ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్యారా లాల్ గర్గ్, పంజాబ్ విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యుడు, అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుఖ్‌దేవ్ సింగ్ సిర్సా, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ జమ్మూ, ఐజేయూ సెక్రెటరీ జనరల్ డి. సోమసుందర్, ఐ.జే.యూ. పూర్వాధ్యక్షుడు ఎస్.ఎన్. సిన్హా, వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్.ఎస్. ధలీవాల్ తదితరులు కార్యక్రమంలో మాట్లాడారు.

ఐ.జే.యూ. జాతీయ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జమ్మూ మాట్లాడుతూ మీడియాని అణచివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పద్ధతులను అవలంబిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలను కవర్ చేస్తున్న సమయంలో జర్నలిస్టులను, ముఖ్యంగా మహిళా పాత్రికేయులను వేధించిన ఘటనలను ప్రస్తావిస్తూ జర్నలిస్టులు కేవలం తమ వృత్తిపరమైన బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తున్నారనీ, వారు తమ గుర్తింపు కార్డులను కూడా చూపించినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా పాశవికంగా దాడులు చేశారని, అరెస్టులు చేసి వేధించారని బల్విందర్ సింగ్ జమ్మూ విమర్శించారు.

మీడియాను మత ప్రాతిపదికన విభజించే ప్రయత్నాలు కూడా ఇటీవల జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. న్యూఢిల్లీ లో ఇద్దరు ముస్లిం మహిళా జర్నలిస్టులపై జరిగిన దౌర్జన్యాన్ని, దాడిని ఆయన గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థలో పాదుకుంటున్న వివక్షాపూరిత వైఖరికి ఈ ఉదంతం నిదర్శనమని జమ్మూ అన్నారు. పంజాబ్‌ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్ల తొమ్మిది నెలలు గడుస్తున్నా, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని బల్విందర్ సింగ్ జమ్మూ అన్నారు. పైగా మీడియా స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం వాణిజ్య ప్రకటనలను ఒక ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు.

ఐ.జే.యు. సెక్రెటరీ జనరల్ డి. సోమసుందర్ మాట్లాడుతూ దేశంలో మీడియా రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నప్పటికీ వర్కింగ్ జర్నలిస్టుల వేతనాలు అల్పంగా ఉంటున్నాయని వారు గత ఇరవై ఏళ్లుగా వేతన సవరణకు నోచుకోలేదని, పైగా పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని, వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని,జర్నలిస్టుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పద్దెనిమిదేళ్ళ పిన్న వయసులో బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన గదర్ విప్లవకారుడు షహీద్ కర్తార్ సింగ్ స్ఫూర్తి పంజాబ్ కి పరిమితం కాదని సోమసుందర్ చెప్పారు.
స్వాతంత్ర్యోద్యమ సమయంలో గదర్ పార్టీ ప్రభావం ఆంధ్ర ప్రజలపై కూడా పడిందని, తెలుగు విప్లవకారుడు దర్శి చెంచయ్య గదర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు.

షహీద్ భగత్ సింగ్ స్థాపించిన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కు తెలుగు రాష్ట్రాలలో గట్టి అనుచర బృందం ఏర్పడిందని సోమసుందర్ తెలిపారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ అమరత్వాన్ని ఇప్పటికీ తెలుగు ప్రజలు స్ఫూర్తిగా తీసుకుంటున్నారని , ఆంధ్రా ప్రాంతంలో దాదాపు అన్ని పట్టణాల్లో భగత్ సింగ్ విగ్రహాలు కనిపిస్తాయని సోమసుందర్ వివరించారు. తెలుగు సామాజిక జీవితంలో సిక్కు సమాజం తగినంత ప్రభావం చూపుతోందని తెలిపారు. పలు పట్టణాల్లో గురుద్వారాలు కూడా ఉన్నాయని వివరించారు. జాతీయ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో పంజాబ్ చండీఘర్ జర్నలిస్ట్ యూనియన్ మరింత క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

సభను ఉద్దేశించి పంజాబ్- చండీగఢ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర ఛైర్మన్ బల్బీర్ సింగ్ జండు, అధ్యక్షుడు జై సింగ్ ఛిబ్బర్, ప్రధాన కార్యదర్శి సంతోఖ్ గిల్ మాట్లాడుతూ నవంబర్ 16 నుండి నవంబర్ 23 వరకు “జాతీయ పత్రికా దినోత్సవం” , షహీద్ కర్తార్ సింగ్ సరాభా వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి బిందు సింగ్, జగ్తార్ భుల్లర్, జగ్తార్ సిద్ధూ, సుఖ్‌నైబ్ సిద్ధూ, జగ్సీర్ సంధు, తేజిందర్ థిండ్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ వ్యవస్థాపక కమిటీ సభ్యులను, సీనియర్ పాత్రికేయులను ఈ సందర్భంగా సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.